Tuesday, 9 June 2015

http://andhrabhoomi.net/specials/AADIVAVRAM%20-%20Katha/content/swa-0#.VV33yWVYiNM.facebook

స్వయంపాకం

  • 17/05/2015
  •  | 
  • -లక్ష్మి మాధవ్


కథల పోటీలో
సాధారణ ప్రచురణకు ఎంపికైన రచన
ఆ రోజు బంద్ వల్ల స్వాతి శ్రీరాం ఇద్దరి ఆఫీసులకి సెలవు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని ప్రతిరోధించటానికి ఆటో, బస్సు డ్రైవర్లు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. అనుకోకుండా దొరికిన ఈ సెలవుని పురస్కరించుకొని హాయిగా బద్ధకంగా స్థాయితీగా లేచారిద్దరూ. నాకు ఇలా నిదానించటానికి అస్సలు అవకాశం లేదే అని ఉక్రోష పడుతున్నాడేమో సూరీడు ఇంకా వేడెక్కి ధగధగా మండిపడుతున్నాడు.
స్థాయితీగా టీవీ చూస్తూ టిఫిన్ తిని చేతులు కడుక్కుంటున్న శ్రీరాంతో అన్నది స్వాతి.
‘నేను వచ్చే వారంలో ఆఫీసు పని మీద ఓ ఐదారు రోజులపాటు నొయిడా వెళ్లాల్సి ఉంటుంది శ్రీ’
‘అయ్యో మరి నా భోజనం విషయం ఎలా? నాకైతే ఇంక ఆ ఆరు రోజులపాటు హోటల్ తిండితో పాట్లు తప్పవన్నమాట’ డీలా పడిపోయాడు శ్రీరాం.
‘ఐతే... నీకు నేను నీతో లేనన్న బెంగ ఏ మాత్రం లేదన్నమాట. ఎంత మాత్రం వంట చేసి పెట్టే దిక్కుండదనేగా నీ బాధ’ బుంగమూతి పెట్టింది స్వాతి.
‘లేదు స్వాతి. మనం ఇద్దరం దగ్గర లేకపోయినా కూడా.. మొబైల్‌లోనైనా రోజంతా మాట్లాడుకోవచ్చు. అంతగా కావాలనుకుంటే వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు. కానీ వంట విషయం అలా కుదరదుగా... నాకు హోటల్ తిండి అసలే పడదని నీకు తెలుసుగా? అందుకని..?’ అన్నాడు శ్రీరాం దిగులుగా.
స్వాతి విచిత్రంగా మొహం పెట్టి ‘మరీ అలా తల్లి దగ్గర పాలు తాగే పిల్లాడిలా బిహేవ్ చేయకు శ్రీ!’
‘లేదు స్వాతి నీకు నా విషయం ఇంకా పూర్తిగా తెలీదు. నాకు చిన్నప్పటి నుంచి ఇంటి భోజనం తప్ప ఇంకే తిళ్లు పడవు’
‘అవును మహాశయా! ఆ కథలన్నీ నేను మీ అమ్మగారి ద్వారా, నా వివాహమునాడే విని యుంటిని’ అంది నాటక ఫక్కీలో.
‘ఐతే మరి తెలిసి కూడా నన్ను నిర్దయగా ఇలా విడిచి వెళ్లటం భావ్యమా సతీ’ అన్నాడు తనూ అదే ఫక్కీలో జవాబు చెప్తూ, ప్రాధేయపడుతున్నట్లు ఆమె వైపు చేతులు చాస్తూ.
‘అయినా శ్రీ నేనొక్కత్తినే క్రితంసారి నువ్వు ముంబై ట్రైనింగ్‌కని నెల్లాళ్లు వెళ్లినప్పుడు అవలీలగా సర్దుకుని, మేనేజ్ చేసేయ్యలేదూ?’ అంది లేని కాలర్‌ని ఎగరేస్తున్నట్లు పోజ్ కొడుతూ.
‘మహా చేశావులేస్తూ. ఐనా టైట్‌గా సెక్యూరిటీ ఉన్న మన అపార్ట్‌మెంట్‌లో నెల్లాళ్లు ఉండడమూ ఒక గొప్పే? అయినా ఇంట్లో ఓ బల్లో బొద్దింకో కనిపించగానే నువ్వు చేసే హడావిడి నాకు తెలీదా? డినోసర్ వచ్చేసినంత హడావిడి చేసి మంచం మీదకి ఎక్కి నువ్వు చేసిన డాన్సు నే మర్చిపోగలనా?’ ఇదివరలో జరిగిన విషయం తల్చుకుని దెప్పి పొడిచాడు హాస్యంగా మొహం పెట్టి శ్రీరాం.
నాలిక్కరచుకుంది స్వాతి. ఈసారి అవసరం తనదని గ్రహించిన శ్రీరాం పిల్లిలా,
‘అయినా ఒక్కొక్కళ్లకి ఒక్కో బలహీనత ఉండడం సహజం అని నేను ఒప్పుకుంటాను’ అన్నాడు చాలా ఉదారంగా తన బలహీనతని తను ఒప్పేసుకుంటూ.
‘ఇది మీ బలహీనత అని నేనూ ఒప్పుకుంటున్నాను. అయినా మీ అమ్మగారు పెళ్లిలో అప్పగింతల తంతు అవ్వగానే మిమ్మల్ని నాకు అప్పగిస్తూ పెట్టిన అప్పగింతలలో చెప్పనే చెప్పారు. మీకున్న ఒక్కగానొక్క చెడ్డ అలవాటు ఇంటి తిండి తప్ప మరెక్కడా తినటం ఇష్టం లేకపోవటమేనని. స్వంతంగా ఓ కప్పు కాఫీ గాని ఓ ముద్ద అన్నం గాని చేతులారా వండుకోవటం నచ్చదని...’ అని ఓ క్షణం స్వాతి గుక్క తిప్పుకునేలోపే అందుకున్న శ్రీరాం
‘ఇన్ని చెప్పి ఏమి ప్రయోజనం?... నన్ను ఇలా వొంటరివాడిని చేసి తిండికి మాడ్చి ఏకంగా ఓ వారం హాయిగా నోయిడా చెక్కేస్తున్నావే’ అన్నాడు బిక్కమొహం వేస్తూ.
అని చెప్పి.. ‘నువ్వే కాస్త వాడికి ఇవ్వన్నీ నేర్పి ఓ దారికి తీసుకురావాలి తల్లీ అన్నారు’, సహంలో ఆపిన తన వాక్యాన్ని ముగించి కొంటెగా కళ్లెగరేసింది స్వాతి.
‘హమ్మో! హమ్మో...! పెళ్లి అయ్యి అవ్వకుండానే అమ్మ నా గుట్టంతా కోడలి దగ్గర రట్టు చేసి ఇంత వెన్నుపోటు పొడుస్తుందనుకోలేదు... అసలు అత్తాకోడలు అంటే సీరియల్స్‌లోలా దెబ్బలాటలు, ఎత్తిపొడుపులూ, ఇవేవీ లేకుండా... ఇలా..! హౌరా! అయినా కలికాలవమ్మా...’ అన్నాడు శ్రీరాం పక్కింటి ముసలమ్మగారి ఊత పదాన్ని వెక్కిరిస్తూ బుగ్గలు నొక్కుకుంటూ.
‘దీన్ని హాస్యంగా తేల్చేసి జారుకుందామని పిచ్చి ఆశలు పెట్టుకోకు శ్రీ. ఈ రోజు సీరియస్‌గానే చెప్తున్నాను. ఎలాగో మనిద్దరికీ ఈ రోజు సెలవే కాబట్టి ఇవాళ నువ్వు వంట నేర్చుకోవటానికి వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగ పరచుకుని వంట నేర్చుకోక తప్పదు’ పురమాయిస్తున్నట్లు చెప్పేసింది స్వాతి.
‘అయ్యో!! పది రోజులూ ఉపవాసమైనా ఉంటాను కాని అది మాత్రం కుదరదు. అయినా నేను సునాయాసంగా ఓ రోజంతా పెద్దగా ఏమీ తినకుండా అవలీలగా గడిపెయ్యగలను’ అన్నాడు మేకపోతు గాంభీర్యం నటిస్తూ. ఏదో ఒకటి చెప్పి అలా మెత్తబరిచి వంటలూ అవి చేయించుకుందామని కలలు కనకు’ నిశ్చయంగా చెప్పేశాడు శ్రీరాం.
‘ఐతే అంతేనా! బాగా ఆలోచించుకో. ఈ రోజు బంద్ కదా?’ హోటల్స్ కేటరింగ్ సర్వీసులు అన్నీ సెలవే మరి. మధ్యాహ్నం భోజనం నువ్వు వంట చేస్తేనే తినగలిగేది. లేకపోతే ఇద్దరూ పస్తే మరి’ అల్టిమేటం ఇచ్చేసింది స్వాతి.
‘అబ్బ ఎంత గూడుపుఠాణి పన్నావ్ స్వాతి. మీ అత్తగారూ, నువ్వూ కలిసి ఇంత హీనానికి ఒడిగడతారనీ, నన్ను పస్తులు పెడతారని అనుకోలేదు. అయినా నేను మెత్తబడితేగా! మీ ఆటలు చెల్లవు’ అని నిక్కచ్చిగా చెప్పేసి ధర్నాకి కూర్చున్న వాడిలా కృతనిశ్చయంతో లాప్‌టాప్ తెరచుకుని కూర్చున్నాడు సోఫా మీద శ్రీరాం.
ఈ రోజు అతనిని అంత సులభంగా వదలకూడదని నిశ్చయించుకున్న స్వాతి కూడా మొండిగా మంచమెక్కి మసుగుతన్నింది.
ఆమె ఆలోచిస్తోంది... శ్రీరామ్ ఇంత మంచి మనిషి. ఐనా ఎందుకో ఈ ఒక్క విషయంలో ఇంత మొండిగా వ్యవహరిస్తాడు? వింత మనిషి అనుకోకుండా ఉండలేక పోయింది. అలా అని అతనికి ఆడవాళ్లకి సహాయపడకూడదని ఏమీ ఉండదు. ఆఖరికి స్వాతి బట్టలు కూడా అవసరమైతే ఉతికి ఇస్ర్తి కూడా చేసి పెడతాడు. కానీ వంట నేర్చుకోవటం, వండుకోవటం మాత్రం అతనికి గిట్టని విషయం. ఎందుకో మరి? క్రితంసారి తన తల్లికి వొంట్లో నలతగా ఉందని తను ఒక వారం ఊరు వెళ్లి వచ్చేసరికి, సరిగా తిండి తినక లంఖణం మనిషిలా తయారయ్యాడు. ఊరి నించి వెనక్కి వచ్చాక మళ్లీ శ్రీరామ్ ఆరోగ్యం కుదుటపరిచేసరికి తన తల ప్రాణం తోకకు వచ్చింది. హోటల్ తిండి పడని వారు చాలామంది ఉంటారు కాని అటువంటి వారు స్వయంపాకం అయినా ప్రయత్నించి చేతులు, వేళ్లూ కాల్చుకునైనా కాస్తంత వండుకోవటం అలవాటు చేసుకుంటారు. మరి - శ్రీరామ్ విషయం ఎలా?’ అని ఆలోచిస్తూనే ఆమె నిద్రలోకి జారుకుంది.
మధ్యాహ్నం మూడు దాటుతున్నా వారి ఫ్లాట్లో పొయ్యిలో పిల్లి లేవలేదు సరికదా కనీసం అటు నించి ఇటు ఒత్తిగిల్లను కూడా లేదు. ఇక కడుపులో పరిగెడుతున్న ఎలుకల్ని అదుపులోకి తెచ్చుకోలేక శ్రీరామ్ డబ్బాల్లో ఏవైనా చిరుతిళ్లు ఉన్నాయేమోనని వెతకసాగాడు.
అప్పుడప్పుడే సుష్టుగా నిద్ర లాగించి లేచిన స్వాతి దాన్ని ఓరకంట గమనిస్తున్నట్లుంది. వెనక నించి ‘అవన్నీ నిన్న రాత్రి సినిమా చూస్తూ కానిచ్చేసాంగా..?!’ అంది.
తనకి ఆకలిని తెలియచెప్పుకోవటం ఇష్టంలేక బిడియంగా ఉండటం వల్ల అది వ్యక్తపరచకుండా హుషారుగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నట్లు నటించసాగాడు శ్రీరాం... అతను మంచి తిండి పుష్టిగల మనిషని స్వాతికి బాగానే తెలుసు. అందుకే అతని వంక అలవోకగా చూస్తూ పక్కన అలమార్లో ఉన్న తన హ్యాండ్‌బాగ్ అందుకుని అందులోంచి పెద్ద కేడ్‌బరీస్ చాక్లెట్ తీసి తినటం మొదలుపెట్టింది. మొహమాటానికైనా తనకి కూడా ఓ ముక్క తినమని పెట్టలేదు. పోనీ అడుగుదామంటే అహం అడ్డు వస్తోందాయె!
చిన్నప్పట్నించీ తన మొండితనం తల్లికి బాగా తెలుసు. తను ఎంత చెప్పినా వినకపోవటంతో తనని వంట నేర్చుకోమని చెప్పి చెప్పి, అమ్మ విసుగెత్తి ఇక చెప్పటం మానేసింది. తన అదృష్టం వల్ల తనకి ఉన్న ఊళ్లోనే చదువు ఉద్యోగం కుదరటం వల్ల తన పంతాన్ని ఇంతవరకూ బాగానే నెగ్గించుకొచ్చాడు. పెళ్ళయ్యాక స్వాతి ఉద్యోగం చేస్తున్న ఊరికి తను బదిలీ చేయించుకుని ఈ ఊరు మారటం జరిగింది.
స్వాతి ఇంక మెత్తబడి వంట మొదలుపెట్టే సూచనలేవీ నామమాత్రంగానైనా కనిపించటం లేదు.
‘ఇప్పుడేం చెయ్యాలి? అసలే ఈ రోజు బంద్ బాగా అమలు పరుస్తున్నట్లుంది వార్తల్లో విశేషాలు చూస్తూంటే. లేకపోతే ఈపాటికి కనీసం బయట నుంచి ఏ పళ్లైనా తెచ్చుకుని తిని తన కడుపులోని ఎలకల్ని అదుపులోకి తెచ్చేసి ఉండేవాడు. హోటల్ తిండి పడకపోయినా ఐస్‌క్రీం లాంటివి బానే లాగిస్తాడు తను. తన ఫ్లాట్ పక్కనున్న ఐస్‌క్రీం పార్లర్‌కి వెళ్లి ఈపాటికి తన ఆకలి బాధకి పగ్గాలు వేసుకుని, తన ప్రస్తుత గండం గట్టెక్కించుకుని, స్వాతి లేవనెత్తిన కొత్త సంకటం నుంచి బయటపడుండేవాడు. అయినా చిన్నతనం నుంచి తల్లి తనను ఎన్నిసార్లు ఈ విషయంగా బలవంతం చేసినా, చివరికి తను మారడని తెలిసి తన మొండితనంతో రాజీ పడిపోయిందే కాని అతన్ని ఇంతగా ఎప్పుడూ మాడ్చలేదు. ఎంతైనా తల్లి మనసు తల్లిదే మరి...
ఆఖరికి వొంట్లో ఎంత నలతగా ఉన్నా కూడా తానింక పస్తులుంటాడని, ముక్కుతూనో మూలుగుతూనో కుక్కర్లో అన్నం, పప్పు పడేసి ఊరగాయ ముక్క, గడ్డపెరుగు పోసి మరీ సుష్టుగా భోజనం పెట్టేది. ఎంతైనా అమ్మకి తనంటే ఎంత ప్రేమ. అయినా ఏ తల్లైనా అంతే. పిల్లలు ఆకలితో ఉంటే సహించలేదు. ఇంకొన్నాళ్లు పోతే ఇలా పంతాలు పోయి స్వాతే పిల్లల్ని ఆకలితో ఉంచలేక ఇలాంటివన్నీ మరిచి నాలుగు ముద్దలు వండేస్తుంది.’ అనుకుని ఓ క్షణం ఒకరిద్దరు పిల్లలు తనూ స్వాతి.. ఆ పరిస్థితులు ఊహించుకుని వింతగా నవ్వుకున్నాడు మనస్సులో.
సమయం గడిచిపోతోంది కాని స్వాతి మెత్తబడే లక్షణాలేవీ స్వాతి వైఖరిలో కనపడటం లేదు. పోనీ ‘అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అని తెల్లజెండా ఊపేసి సంధి కుదుర్చుకుందామా’ అని ఆలోచిస్తూ ఇంట్లోకీ, బాల్కనీలోకి పచార్లు చెయ్యటం మొదలుపెట్టాడు శ్రీరాం.
బయట ఆకాశం మేఘావృతమై ఉంది. సూరీడు తన దుకాణం కట్టేసి ఇంటికెళ్లక తప్పదని మెల్లమెల్లగా మేఘాల చాటు నుంచి మొహం చాటేస్తున్నాడు. వానొచ్చేలా ఉందని పక్కింటి బిందుగాడి తల్లి ఆటలకి పంపనని మొరాయించి చదువుకి కూర్చో పెట్టినట్టుంది ఇక తప్పదురా దేవుడా...! అనుకుంటూ పాఠాలు గట్టిగా తల్లి చెవులు చిల్లులు పడేలా అరుస్తూ చదువుతున్నాడు. అప్పుడైనా ఆవిడికి విసుగెత్తి, ఆపమనేలా అరుస్తూ చదువుతున్నాడు.
‘కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సస్యములు వాటి ఆహారమును అవే తయారుచేసుకొనును’
కడుపులో కరకరల మధ్య ఆ వాక్యాలు చెవిన పడగానే శ్రీరామ్‌కి ముళ్లు గుచ్చుకున్నట్లు ఓ అనుభూతి. తన తల్లి, స్వాతి తనని ఎందుకు వంట నేర్చుకోమని, ఇంతగా పోరుతున్నారు? తిండి విషయంలో తను ఇంకొకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని పెట్టే పోరు వెనక పాయింట్ ఉందనిపించింది.. అవును నిజమే. వంట నేర్చుకుని ఉండటం మనిషికి చాలా ముఖ్యం. పోనీ ఇప్పుడు నేర్చుకుంటే... స్వాతిని లేపి ఎలా వండాలో నేర్పమని, ఈ రోజే వంట క్లాసులు మొదలెట్టమని అడిగితే...?
వద్దు వద్దు... తను ఆకలి తట్టుకోలేక ఓడిపోయినట్లు అనుకుంటే తన పరువేం కాను... అహం అడ్డుపడి, మళ్లీ మనసు వార్నింగ్ ఇచ్చింది.
ఇంతవరకూ ఎన్నిసార్లు చెప్పినా...
ఇంత బెట్టు చేసి, ఇప్పుడెలా అడగటం అని ముందూ వెనకా ఆలోచిస్తూండగా ఓ ఉపాయం తళుక్కుమంది శ్రీరామ్ మనసులో. వెంటనే లాప్‌టాప్ తెరచి అమలులో పెట్టాడు. యూట్యూబ్‌లో ‘అన్నం వండటం ఎలా?’ అన్న డెమో కోసం వెతికాడు.
లాప్‌టాప్‌ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి డెమో చూస్తూ ఇట్టే కుక్కల్లో బియ్యం పడేశాడు. ఈలోపు వంటింటి కేబినెట్‌లో తెలుగు వాళ్ల కల్పతరువు, ఆవకాయ సీసా, కందిపొడి డబ్బా వెతికి తెచ్చాడు. పెరుగు కోసం ఫ్రిడ్జ్ దాకా వెళ్తుంటే కంచాలతో స్వాతి డైనింగ్ టేబుల్ వద్ద ప్రత్యక్షమైంది. అమ్మ దొంగా వెనక నుంచీ తను చేసేవన్నీ గమనిస్తోందన్నమాట.
ఆమె చెప్పినది తను వింటున్నానన్న అహంతోనో, తను ఓడిపోయినట్లు ఆమె భావిస్తే అని బిడియపడ్తున్నాడు లోలోనే శ్రీరామ్. అందుకే వౌనంగా, గంభీరంగా ఘడియలు మెల్లగా దొర్లిస్తున్నాడు. ఈలోగా ఆమె గొంతు సవరించుకుని గారంగా,
‘మీరు వడ్డించబోయే ఆవకాయ విందుకై నా మనసు తహతహలాడుతోంది నల మహారాజా?’ అంది నాటకీయంగా.
శ్రీరాంకి నవ్వాగలేదు. కుక్కర్ వారిద్దరి నవ్వులతో శృతి కలిపింది.
*
లక్ష్మి మాధవ్
డి-14, సిఎఫ్‌టిఆర్‌ఐ క్వార్టర్స్, సిఎఫ్‌టిఆర్‌ఐ, మైసూర్-570 020.

No comments:

Post a Comment